Balaiah Died in Saudi


సౌది అరేబియాలో చింతకుంట వాసి మృతి మృతదేహం కోసం కుటుంబ సభ్యుల నిరీక్షణ

ఉన్న ఊరిలో ఉపాధి కరవై జీవనోపాధి కోసం ఎడారి దేశాలకు వెళ్ళిన కరీంనగర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అక్కడే మృతి చెందాడు. ఇంటి నుంచి వెళ్ళిన రెండు నెలలకే చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు సౌది నుంచి సమాచారం అందడంతో కన్నిరుమున్నిరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... చింతకుంట లోని తారక రామకృష్ణ నగర్ కు చెందిన బోనగిరి బాలయ్య (39) గ్రామంలోనే వ్యవసాయ కూలిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తనకు తెలిసిన ఓ ఏజెంట్ ద్వార సౌది అరేబియాలో వ్యవసాయ కూలి పనిపై వెళ్లేందుకు వీసా పొందాడు. జూలై 20 న సౌది అరేబియా వెళ్ళిన ఆతను వీసా పొందడం కోసం రూ.2 లక్షల అప్పు చేసాడు. అయితే సౌది అరేబియా వెళ్లి రెండు నెలలు అవుతోంది. గత ఆదివారం బాలయ్య చనిపోయాడంటూ సౌదీలో ఉంటున్న బంధువులు బాలయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృత దేహాన్ని స్వగ్రామానికి తీసుకు వచ్చేందుకు రూ.2 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. అయితే వీసా కోసం చేసిన రూ.2 లక్షల అప్పునకే వడ్డీ కట్టలేని స్తితిలో ఉన్నామని, ప్రస్తుతం పూట గడవడమే భారంగా ఉన్న దుస్థితిలో మృతదేహాన్ని గ్రామానికి తీసుకు రావడానికి రూ.2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకు వచ్చేదని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం చొరవ చూసి మృతదేహాన్ని తీసుకు రావడానికి కృషి చేయాలనీ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites