Soudi Police Arrested South Indians



సౌది జైల్లో జిల్లా వాసుల నరక యాతన
పట్టించుకోని భారత రాయబార కార్యాలయం
భర్తను విడిపించాలని సత్తమ్మ వేడుకోలు

సౌదీ అరేబియా జైల్లో మగ్గుతున్న ప్రవాస భారతీయులు నరకాన్ని చవిచూస్తున్నారు. ఆదుకుంటుదనుకున్న భారత రాయబార కార్యాలయం స్పందించకపోవడం, అక్కడి అధికారులు శ్రుతిమించి వ్యవహరించడంతో జైల్లో మగ్గుతున్న జిల్లా వాసులు కన్నీరు మున్నీరవుతున్నారు. అలికిడైతే చాలు ఏమి జరుగుతుందోనని ఉలిక్కిపడుతున్నారు. ప్రాణాలతో ఇంటికి తిరిగి వెళ్తామ అని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామానికి చెందిన పాల్తేపు జలపతి 2008 ఏప్రిల్ 24 న బతుకు దెరువు కోసం ఆజాద్ వీసాపై సౌదీ అరేబియా వెళ్ళాడు. అక్కడ కపిల్(దళారీ) జలపతి పాసుపోర్టును తీసుకోని పనిలో నియమించుకున్నాడు. మూడు నెలల పని సాఫీగా చేశాక విదుల్లోనే ప్రమాదం జరిగి జలపతి కాలు విరిగింది. ఆజాద్ వీజాపై పనిచేస్తుండడంతో సొంత డబ్బులతో వైద్యం చేయించుకోవాలని దళారీ జలపతిని సూచించాడు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుండగా అక్కడి పోలీసులు పాసుపోర్టు లేదనే నెపంతో అరెస్ట్ చేసి రియాద్ సఫార్ జైల్లో (జీఎంసి) లో పెట్టారు. పాసుపోర్టు కోసం తుదికంట ప్రయత్నించిన దళారీ పాసుపోర్టును ఇవ్వకపోవడంతో జలపతి సౌదీ జైల్లోనే మగ్గుతున్నాడు. జలపతితో పాటే జైళ్లో చేరిన కేరళకు చెందిన ఓ యువకుడు తిండిలేక తమ కళ్ళెదుటే మరణించాడని జలపతి "న్యూస్ టుడే" తో మంగళవారం రాత్రి ఫోన్ లో వాపోయాడు. జలపతితో పాటే జగిత్యాల మండలం హిమ్మత్ రావు పేట గ్రామానికి చెందిన కొండయ్యతో పాటు మరికొంత మంది జిల్లా వాసులు సౌదీ జైళ్లో మగ్గుతున్నారని వారు తెలిపారు. తన భర్త సౌదీ జైళ్లో దుర్బర జీవితం గడుపుతున్నాడని తెలిసిన భార్య సత్తమ్మ తిండి తిప్పలు మాని భర్త తిరిగివస్తే చాలని దేవుడిని వేడుకొంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తన భర్తను జైలు నుంచి విడిపించాలని రోదిస్తుంది. రెక్కాడితే గాని డొక్క నిండని పరిస్తితుల్లో జీవనం సాగిస్తున్న తమను ఆదుకోవాలని సత్తమ్మ రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టిస్తుంది.

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites